Wednesday 9 January 2013

Nayak Review, rating- Ram charan, Kajol,Amala Paul

Rating : 3 / 5 రామ్ చరణ్ హీరోగా నటించిన కొత్త సినిమా నాయక్. ఈ సినిమాకు వి.వి.వినాయక్ దర్శకత్వం వహించడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. కాజల్, అమలాపాల్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేయడం విశేషం. మరి ‘నాయక్’ ఎలా ఉన్నాడో చూద్దాం..! చిత్రకథ : ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ, కలకత్తా లో ఉన్న అక్క- బావల వద్దకు వచ్చి మరదలితో ప్రేమలో పడ్డ సాధారణ కుర్రాడు ఒకరు. హైదరాబాద్ లో సాప్ట్ వేర్ ఇంజనీర్ గా విలాసవంతమయిన జీవితాన్ని గడుపుతూ తన చలాకీతనంతో లోకల్ గా పేరు మోసిన రౌడీ చెల్లెల్నే ప్రేమాయణంలో దింపిన కుర్రాడు మరొకరు. వీరిద్దరి లో ‘నాయక్’ ఎవరు ? ఒక సాధారణ యువకుడు ప్రజలందరూ అభిమానించే అసాధరణ ‘ నాయక్’ గా మారడానికి కారణమైన పరిస్థితులు ఏమిటీ? అస్సలు వీరిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏమిటీ? అనేవి వెండితెర మీదే చూడాలి. నటీనటుల ప్రతిభ : రామ్ చరణ్ ఈ సినిమాలో చలాకీ చెర్రీ గాను, ప్రజల కోసమే జీవించే ‘నాయక్’ గానూ ద్విపాత్రాభినయం చేశాడు. చెర్రీ గా కరెక్ట్ గా సూటైన రామ్ చరణ్, ‘నాయక్’ కు అవసరమైన సీరియస్ నెస్ ను చూపించలేక పోయాడు. 25 సినిమాల తరువాత చేయవల్సిన పాత్ర కోసం అప్పుడే తొందరపడ్డాడనిపిస్తుంది. అయితే డాన్సుల్లో మాత్రం ఇరగదీసాడు. ఈ సినిమాతో డాన్సుల్లో చిరంజీవి తనయుడు అనిపించుకుంటాడు. కాజల్, అమాలాపాల్ కు పెద్దగా ప్రాధన్యం లేదు. బ్రహ్మనందం మరో సారి తన సత్తా చూపించాడు. జయప్రకాష్ రెడ్డి సీరియస్ గా నటిస్తూన్నే కామెడి పండించాడు. పోసాని గుర్తుపెట్టుకునే పాత్ర చేశాడు. పోసాని ‘చాక్లెట్’ ఎపిసోడ్ నవ్వులు పూయిస్తుంది. మిగిలిన వారు తమ పాత్రల పరిధిలో నటించారు. సాంకేతిక వర్గం పనితీరు : ఫోటోగ్రఫీ ఈ సినిమాకు ప్రధాన బలం. పాటలు, ఫైట్లు తెర మీద చాలా రిచ్ గా కనిపిస్తాయి. సంగీతం ముఖ్యంగా పాటలు, వాటి చిత్రీకరణ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ‘కత్తి లాంటి పిల్లా..’, ‘శుభలేఖ రాసుకున్నా..’ చిత్రీకరణ బావున్నాయి. ఆకుల శివ సంభాషణలు ఈ చిత్రానికి హైలెట్ అని చెప్పాలి. కామెడీ, సీరియస్ నెస్ ను పండించాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకత్వం విషయానికి వస్తే వినోదం, యాక్షన్ లు మేళవించి ఈ సినిమాను రూపొందించాడు. పాత కథనే తనదైన శైలీలో చెప్పడానికి కృషి చేశాడు. అయితే, సినిమా అంతా చక్కగా నడిపించిన దర్శకుడు కీలక విషయాల్లో తడబడ్డాడు. ‘నాయక్’ పాత్ర చిత్రీకరణ, ముగింపు సన్నివేశాలపై మరింత దృష్టి పెడితే అచ్చమైన ‘వి‘నాయక్’’ సినిమాలా మిగిలేది. హైలెట్స్ : రామ్ చరణ్ డాన్సులు, డైలాగులు, స్క్రీన్ ప్లే, పాటలు. డ్రాబ్యాక్స్ : సాధారణమైన కథ, ఆశించిన స్థాయిలో ‘నాయక్’ పాత్ర లేక పోవడం విశ్లేషణ : ‘నాయక్’ అనే టైటిల్ పెట్టినా సినిమా కామెడీ తో ఆకట్టుకుంటుంది. కామెడీ పండించడంలో తనకున్న ప్రతిభను వినాయక్ మరోసారి ప్రదర్శించాడు. అలాగే, హీరోయిన్ ప్రేమించకపోతే ఒక వ్యక్తి బిల్డింగ్ పై నుంచి దూకుతానని బెదిరిస్తే హీరో దాన్ని అపే తీరు, చిన్నపిల్లలతో బిక్షాటన ఎపిసోడ్, పోసాని ‘చాక్లెట్’ సీన్స్, నాయక్ తమను విడిచి వెళ్లవద్దంటూ ప్రజలు కోరే సన్నివేశాలను ఆకట్టుకునే విధంగా తీసిన దర్శకుడు ‘నాయక్’ పాత్రను, ముగింపును అదే విధంగా మలచలేకపోయాడు. ‘నాయక్’ ను ప్రజలు ఎందుకు అంతగా అభిమానిస్తారో ప్రేక్షకులు మెచ్చే విధంగా చెప్పలేక పోయాడు. ‘ఐటెం సాంగ్’ లో నాయక్ డాన్స్ చేయడం ఆ పాత్ర హుందతనాన్ని తగ్గించింది. ఈ సినిమాలో వినాయక్ గత చిత్రాల ఛాయలు కనిపిస్తాయి. చెర్రి, అతని మేనమామ పాత్రలు ‘దిల్’ లోని నితిన్, వేణుమాధవ్ తరహాలో సాగుతాయి. కృష్ణ, అదుర్స్, ఠాగూర్ సినిమాల చాయలు కూడా ఈ ‘నాయక్’ లో కనిపిస్తాయి.

No comments:

Post a Comment